ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు - అన్నదాతకు కన్నీళ్లు Michaung Cyclone Impact on NTR District: మిగ్‌జాం తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ (IMD) స్పష్టం చేసింది. అనంతరం తీవ్ర తుపాను స్వల్పంగా బలహీనపడనుంది. వాయుగుండంగా బలహీన పడే సూచనలు ఉన్నాయి. తుపాను ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతంలో భారీగా ఈదురుగాలులు, వర్షం కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావంతో గంటకు 85-95 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎమ్‌డీ అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు: మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా (NTR District) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వరి పంట పూర్తిగా నీట మునిగింది. ప్రభుత్వం గోనెసంచులు, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని రాసులుగా పోసి కాపాడుకుంటున్నారు. నందిగామ మండలం కంచల గ్రామంలో వర్షానికి ధాన్యం తడవుకుండా ఓ రైతు షామియానా టెంట్లు వేశారు. ధాన్యం నిల్వ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మిగ్‌జాం ప్రభావంతో కుండపోత వర్షాలు - నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతల డిమాండ్: తుపాను తీవ్రతకు వరి పంటకు నష్టం వాటిలిందని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తుపాను తీవ్రత వల్ల సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసి, బలమైన గాలులు విచాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల పరిధిలో పలు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలకు సిద్ధంగా ఉన్న పైరు నేలవారింది. రాత్రంతా కురిసిన భారీ వర్షానికి కల్లాల చుట్టూ వర్షపు నీరు చేరింది. మంగళవారం ఉదయం వర్షానికి కొంత విరామం రావడంతో రైతులు పరుగున వెళ్లి నీళ్లు వెలదీశారు. ధాన్యం రాశులపై కప్పిన పట్టాలు తొలగించకపోతే ధాన్యం దెబ్బతినే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. వర్షం తీవ్రతకు పొలంలో ఉన్న వరిగడ్డి పూర్తిగా తడిసిపోయింది. తేమతో సంబంధం లేకుండా నిబంధనలు తరలించి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతల కోరుతున్నారు.
పలు విమాన సర్వీసుల రద్దు: తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులకు వరి పొలాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన పంటను కాపాడుకొనేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తుపాను ప్రభావంతో షార్జా విమాన సర్వీసు మినహా, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ విమాన సర్వీసులను విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాలని తెలిపారు.
తుపాను ప్రభావంపై సీఎం జగన్ ఆరా - అధికారులతో సమీక్ష