కొత్త, క్రియాశీల కేసులు తగ్గుతున్నప్పటికీ.. మహమ్మారిని పూర్తిగా జయించేందుకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా మార్గదర్శకాలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని శుక్రవారం పేర్కొంది.
ఇవీ చేయాల్సింది..
కరోనా వ్యాప్తిని తగ్గించడం సహా టీకాలు పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించింది.
అలాగే అనుమతించిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి ప్రామాణిక నిబంధనలను(ఎస్ఓపీ) కఠినంగా అనుసరించాలని సూచించింది. ఈ మేరకు జనవరి 27న జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఈత కొలనుల్లో అందరికీ..
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. సినిమా థియేటర్లు మరింత మంది సిబ్బందితో నడిపించడానికి అనుమతించింది. ఇక క్రీడాకారుల కోసం ఈత కొలనులకు అనుమతి ఉండగా.. తాజా మార్గదర్శకాల ప్రకారం.. అందరికీ ప్రవేశం ఉంటుందని తెలిపింది. వీటి నిర్వహణకు సంబంధించి ప్రమాణాలను యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తరువాత విడుదల చేయనున్నట్టు పేర్కొంది.
వస్తువుల రవాణాకు, అంతరాష్ట్ర, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి(ఈ-పర్మిట్) అవసరం లేదు. అలాగే పొరుగు దేశాల సరిహద్దుల వద్ద వాణిజ్యం జరిపే వారికి సైతం ప్రత్యేక అనుమతి అవసరం లేదు.
200మందికి పైగా..
ఇప్పటికే సాంఘిక, మత, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక సమావేశాలకు 50 శాతం పరిమితితో అనుమతులున్నాయి. మూసిఉన్న ప్రదేశాలలో 200 మందికి అనుమతించారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో స్థలం పరిమాణాన్ని బట్టి నిర్వహించుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి:2 రోజులు టీకా పంపిణీ బంద్.. కారణమిదే