తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ రూల్స్​ అన్నింటికీ కేంద్రం గుడ్​బై! ఇక మాస్కులు అవసరం లేదా? - కరోనా మహమ్మారి వ్యాప్తి

Corona Restrictions in India: కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి గత రెండేళ్లుగా ఆంక్షల చట్రంలో నలిగిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రహోంశాఖ వెల్లడించింది. అయితే.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది.

covid
కరోనా

By

Published : Mar 23, 2022, 3:38 PM IST

Corona Restrictions in India: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్నందున కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా.. వారికి సమాచారమిచ్చారు. దేశంలో రెండేళ్ల క్రితం కొవిడ్‌ విజృంభించగా.. వైరస్‌ కట్టడికి 2020 మార్చి 24 న మొదటిసారి కేంద్రం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత కేసుల సంఖ్యలో మార్పులను బట్టి పలు సందర్భాల్లో ఆంక్షలను సడలించింది.

గత 7 వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దేశంలో మంగళవారం నాటికి కేవలం 23 వేల 913 క్రియాశీల కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.28 శాతానికి తగ్గింది. అటు.. దేశంలో ఇప్పటివరకు 181.56 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేశారు. కరోనా తగ్గుదలతోపాటు వైరస్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని అజయ్‌ భల్లా తెలిపారు. వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సామర్థ్యాలను పెంచుకొన్నట్లు పేర్కొన్నారు. కరోనా వెలుగు చూసిన తర్వాత వైరస్‌ నిర్ధరణ, పర్యవేక్షణ, చికిత్స, వ్యాక్సినేషన్‌, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొవిడ్ నిబంధనలు పొడిగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నట్లు అజయ్ భల్లా వివరించారు. ప్రస్తుతం ఉన్న ఆంక్షల గడువు ఈనెల 31న ముగియనుండగా.. ఆ తర్వాత ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయడం లేదని తాజా ఉత్తర్వుల్లో హోంశాఖ తెలిపింది.

కొవిడ్ నిబంధనలు పూర్తిగా తొలగించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలిపింది. మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వైరస్‌ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేమని.. అప్రమత్తంగా ఉండటమే ముఖ్యమని భల్లా తెలిపారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగితే.. మళ్లీ నిబంధనలు విధించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ప్రోటీన్ ఆధారిత నొవొవ్యాక్స్ టీకాకు​ అత్యవసర అనుమతి

ABOUT THE AUTHOR

...view details