ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి రోగుల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. కరోనా విజృంభణతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్న సమయంలో.. ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది కేంద్రం. కరోనా చికిత్స చేసే ఆసుపత్రుల్లో.. అగ్ని ప్రమాదాల నివారణకు, ఇతర అన్ని వసతుల కల్పనకు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కేంద్ర హోం శాఖ సూచించింది.
ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రాపాలిత ప్రాంతాల పరిపాలన విభాగాలకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలన్నారు.