మహారాష్ట్ర పాల్ఘర్లో దారుణం జరిగింది. పది నెలల చిన్నారిని కారులో నుంచి బయటకు తోసేశారు దుండగులు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. చిన్నారి తల్లిని వేధించిన నిందితులు.. ఆమె ప్రతిఘటించడం వల్ల మహిళను సైతం కారు నుంచి తోసేశారు. ఈ ఘటన మండ్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంబయి-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
ఓ మహిళ.. తన 10 నెలల కూతురితో కలిసి పెల్హర్ నుంచి పోషీర్కు క్యాబ్లో ప్రయాణిస్తోంది. ఆమెతో పాటు మరికొందరు ప్రయాణికులు సైతం అందులో ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత దూరం వెళ్లాక కారు డ్రైవర్ సహా ప్రయాణికులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీనికి ఆ మహిళ ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన నిందితులు.. వేగంగా ప్రయాణిస్తున్న కారులో నుంచి చిన్నారిని బయటకు తోసేశారు. ఈ ప్రమాదంలో చిన్నారి ఘటనా స్థలంలోనే మరణించింది. అనంతరం మహిళను సైతం కారులో నుంచి బయటకు తోసేయగా.. తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.