మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ బాధ్యతలు స్వీకరించారు. మూడు రోజుల పాటు ఆయన రాష్ట్ర వ్యవహారాలు చూడనున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న తాజా సమీకరణాలు.. శిందే వర్గం- బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విబేధాలను పెంచినట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు.. దేవేంద్ర ఫడణవీస్‌కు సీఎం పదవి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎన్సీపీ అధికార ప్రతినిథి క్లైడ్ క్రాస్టో స్పందించారు. ఎప్పటినుంచో దేవేంద్ర ఫడణవీస్‌కు సీఎం పదవి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శిందే, ఫడణవీస్.. తమ పదవులను మార్చుకోవాలని బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే శిందేనే మరో ఏడాదిన్నర పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయని మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. శివసేన ఠాక్రేలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎన్సీపీ నేతలు, ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత.. శిందే వర్గంలోకి చేరుతారని వార్తలు వస్తున్నాయి.
ఫ్యూచర్ సీఎం అజిత్ పవార్!
మరోవైపు, రాష్ట్రంలోని ధర్శివ్ ప్రాంతంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఫొటో ఉన్న బ్యానర్లు కలకలం రేపాయి. మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి అజిత్ పవార్ అని ఉన్న బ్యానర్లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు అజిత్ పవార్ చేసిన ప్రకటన తర్వాత ఈ బ్యానర్లు ప్రత్యక్షమవ్వడం.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.