మహారాష్ట్ర సోలాపుర్లో ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. ఎంతో కష్టపడి పండించిన పంటను విక్రయియంచిన ఆ వ్యక్తికి కనీసం టీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. సోలాపుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 512 కిలోల ఉల్లిపాయలను విక్రయించిన రైతు.. రూ.2 మాత్రమే సంపాదించారు. ఇందుకు సంబంధించిన రసీదు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
రాజేంద్ర చవాన్ అనే రైతు.. ఫిబ్రవరి 17న 10 బస్తాల ఉల్లిపాయలతో మార్కెట్కు వచ్చాడు. వీటిని తూకానికి పెట్టగా మొత్తం 512 కిలోలు అని తేలింది. అయితే ఉల్లిపాయల ధరలు పడిపోవడం వల్ల కిలోకు రూ. 1 చొప్పున కొంటామని కొనుగోలుదారులు చెప్పారు. మొత్తం ఉల్లిపాయలకు రూ. 512 చెల్లించారు. అయితే పంటను పొలం నుంచి తీసుకొచ్చేందుకు అయిన రవాణా ఖర్చు, కూలీల ఖర్చు, మార్కెట్కు సంబంధించిన ఇతర వ్యయాలన్నీ కలిపి రూ.509.51 అయ్యాయి. అంటే మిగిలింది రూ.2.49. దాన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసిన అధికారులు.. రైతుకు రూ. 2 మాత్రమే వస్తాయని లెక్కగట్టారు. రూ.2 చెక్కును రాజేంద్రకు అందజేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు.
ఈ వ్యవహారంపై అనేక రైతుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 10 బస్తాల ఉల్లిపాయలు విక్రయిస్తే రూ. 2 చెక్ ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డాయి. ఇలా అయితే రైతులు ఎలా బతకాలని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని, విద్యుత్ సరఫరా సరిగా లేక తాము అనేక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.