తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నది లోపల మెట్రో పరుగులు.. దేశంలో ఫస్ట్ టైమ్ - కోల్​కతా గంగా నది మెట్రో

మెట్రో రైల్ నిర్మాణంలో భారత్​ మరో ఘనత సాధించింది. అండర్ వాటర్​ మెట్రో వ్యవస్థను తొలిసారి 'కోల్​కతా మెట్రో' విజయవంతంగా పరీక్షించింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో.. కోల్​కతాలోని మహాకరణ్ స్టేషన్​ నుంచి హావ్​డా మైదాన్​ మెట్రో స్టేషన్​ వరకు రైలు పరుగులు తీసింది.

Kolkata Metro under Ganga
Kolkata Metro under Ganga

By

Published : Apr 12, 2023, 6:10 PM IST

Updated : Apr 12, 2023, 6:34 PM IST

అండర్​ వాటర్​ మెట్రో ట్రయల్స్​ను విజయవంతంగా నిర్వహించింది కోల్​కతా మెట్రో. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో.. మెట్రో రైలు బుధవారం పురుగులు తీసింది. కోల్​కతాలోని మహాకరణ్​ స్టేషన్​ నుంచి హావ్​డా మైదాన్​ మెట్రో స్టేషన్​ వరకు తొలిసారి ప్రయాణించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రయాణంలో.. కోల్​కతా మెట్రో జనరల్ మేనేజర్​ పి. ఉదయ్​ కుమార్ రెడ్డి​ కూడా భాగస్వామి అయ్యారు. ఆయనతో పాటు మరికొందరు ఇంజినీర్లు, అధికారులు నదీ గర్భంలో మెట్రో ప్రయాణం చేశారు. ఈ పరిణామాన్ని.. కోల్​కతా సహా ఆ నగర శివారు ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించే దిశగా పడిన విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు మెట్రో ఉన్నతాధికారులు.

"కోల్​కతా చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. ఈ మైలురాయికి చేరుకునేందుకు కోల్​కతా మెట్రో సిబ్బంది ఎంతో శ్రమించారు. ఎన్నో అవరోధాలను అధిగమించాక ఈ విజయం దక్కింది. ఈ అండర్​ వాటర్ ప్రయాణం.. త్వరలో మొదలయ్యే ట్రయల్​ రన్​కు సన్నద్ధతలో భాగం. మొత్తం 7 నెలల పాటు ట్రయల్ రన్​ సాగుతుంది." అని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు.

మెట్రో రైలును నడిపిస్తున్న అధికారులు

ఈ అండర్ వాటర్​ మెట్రో ట్రయల్ రన్ పూర్తయి, ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే.. ఇరుగుపొరుగు జిల్లాలైన కోల్​కతా, హావ్​డా మధ్య రాకపోకలు మరింత సులువు కానున్నాయి. కోల్​కతాలోని ఎస్​ప్లెనేడ్, హావ్​డా మైదాన్ మధ్య మొత్తం 4.8 కిలోమీటర్లు పొడవైన సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. హుగ్లీ నదీ గర్భంలో.. 32 మీటర్ల లోతులో 520 మీటర్ల సొరంగం నిర్మించారు. మెట్రో రైలు ద్వారా ఈ దూరాన్ని 45 సెకన్లలో చేరుకోవచ్చని అంచనా. హావ్​డా మెట్రో స్టేషన్​ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్​ కానుంది. ఇది 33 మీటర్ల లోతులో ఉంటుంది. కోల్​కతా- హావ్​డా అండర్​గ్రౌండ్ మెట్రో సేవలు ఈ ఏడాదిలోనే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని అంచనా.

సొరంగంలో ప్రయాణిస్తున్న మెట్రో రైలు

భారత దేశంలో మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చిన తొలి నగరంగా కోల్​కతా నిలిచింది. 1984 అక్టోబర్​ 24న కోల్​కతా మెట్రో సేవలు మొదలయ్యాయి. భవానీపుర్​ మెట్రో స్టేషన్​ (ఇప్పుడు నేతాజీ సుభాష్ మెట్రో స్టేషన్​) నుంచి ఎస్​ప్లెనేడ్​ వరకు తొలి రైలు ప్రయాణాలు సాగించింది. 2023 జనవరి నాటికి మూడు మార్గాల్లో మొత్తం 46.96 కిలోమీటర్ల మేర కోల్​కతా మెట్రో సేవలు అందిస్తోంది.

ఇదీ చదవండి:

Last Updated : Apr 12, 2023, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details