ఈ ఏడాది ఏప్రిల్- మే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళలో భాజపా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెట్రో మ్యాన్ శ్రీధరన్ తెలిపారు. త్వరలో ఆ పార్టీలో చేరనున్నారు మెట్రోమ్యాన్. భాజపా కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే తన ప్రధాన లక్ష్యం కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే అని వెల్లడించారు.
'భాజపా అధికారంలోకి వస్తే సీఎం పదవికి సై' - మెట్రో మ్యాన్ భాజపా
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ మెట్రో మ్యాన్ శ్రీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భాజపాలో చేరనున్న ఆయన.. కమలం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
గవర్నర్ పదవిపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. గవర్నర్ పదవి పూర్తిగా రాజ్యాంగ పదవి కావడం సహా దానికి ఎలాంటి అధికారాలు ఉండవని అన్నారు. కేరళలో భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావడం సహా పలు ప్రాధాన్యతా అంశాలను నిర్దేశించుకున్నట్లు శ్రీధరన్ తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదన్నారు. దేశంలో అనేక మెట్రో రైలు ప్రాజక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీధరన్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఈ నెల 25న భాజపాలో చేరే అవకాశం ఉంది.