Meteor showers Maharashtra:ఉగాది రోజున నింగిలో అద్భుతం జరిగింది. ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ గుర్తు తెలియని వస్తువులు కింద పడిపోయాయి. ప్రకాశవంతంగా మెరుస్తున్న వాటిని ఉల్కాపాతంగా పలువురు అభివర్ణించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దృశ్యాలు కనువిందు చేశాయి. అయితే, మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఉపగ్రహ శకలాలు కనిపించడం గమనార్హం.
మహారాష్ట్రలోని అమరావతి, విదర్భ, నాగ్‌పుర్ సహా మధ్యప్రదేశ్‌లోని ఇందోర్, బైతుల్, భోపాల్‌లలో ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. రాత్రి 8 గంటల సమయంలో ఇవి కనిపించాయి. నింగిలో నుంచి నిప్పులు చిమ్ముకుంటూ వస్తువులు కిందకు పడుతున్నట్లు కనిపించింది. ఇవి బుల్లెట్లలా దూసుకొచ్చినట్లు ఈ దృశ్యాల్లో స్పష్టమవుతోంది. 40 సెకన్ల పాటు ఇవి కనువిందు చేసినట్లు తెలుస్తోంది.
ఆకాశంలో వివిధ రంగుల్లో మెరుస్తున్న ఉల్కాపాతం ఆకాశం నుంచి ఏవో పడుతున్నాయని వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఇవి ఉల్కలేనని మహారాష్ట్ర అమరావతిలోని శ్రీ శివాజీ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ పంకజ్ నాగ్పురే తెలిపారు. విశ్రాంత ప్రొఫెసర్ డా. అనిల్ ఆసోల్ సైతం ఇది ఉల్కాపాతమేనని చెప్పారు. దీనిపై స్పందించిన.. నాగ్‌పుర్‌కు చెందిన వ్యోమగామి సురేశ్ చోపనే.. శాటిలైట్ లేదా ఉల్కలు కిందకు పడి ఉంటాయని చెప్పారు. అమరావతిలోని చాలా చోట్ల ఈ ఉల్కాపాతం స్పష్టంగా కనిపించింది. ఇవి భూమిపైకి దూసుకొచ్చినట్లు కనిపించిన కాసేవటికే కనుమరుగయ్యాయి. నాగ్‌పుర్‌లో కూడా చాలా మంది ప్రజలు వీటిని చూసినట్లు చెప్పుకొచ్చారు. విదర్భలో చిత్రీకరించిన పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ ఇవి కనిపించినట్లు తెలుస్తోంది. ఉల్కలు అరేబియా సముద్రంలో పడిపోయాయని సమాచారం.
Meteor showers Madhya pradesh:మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ఈ అద్భుతం కనిపించింది. రాత్రి 7 గంటల తర్వాత రంగురంగుల బాణసంచా కాల్చినట్లు ఆకాశంలో వెలుగులు కనిపించాయని స్థానికులు చెప్పారు. ఉజ్జయిని అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ సైతం.. ఇవి ఉల్కలేనని తెలిపారు. ఉల్కలు తరచుగా భూమిపై పడుతూ ఉంటాయని వెల్లడించారు. ఇది సాధారణంగా జరిగేదేనని, అయితే ఈ సారి ఉల్కల పరిమాణం భారీగా ఉందని తెలిపారు. సాధారణ కంటితో చూసే విధంగా ఉన్నాయని వివరించారు. భూమి వాతావరణంలోకి చేరుకోగానే ఇవి విడిపోతాయని ఉజ్జయిని జివాజీ విద్యాశాల సూపరింటెండెంట్ ఆర్పీ గుప్తా చెప్పారు. అందుకే భూవాతావరణంలోకి ఇవి ప్రవేశించిన తర్వాత కంటికి కనిపించవని తెలిపారు. భూవాతావరణంలో ఉండే గాలి రాపిడికి ఉల్కలు జ్వలించి.. విడిపోతాయని వివరించారు. 99 శాతం వరకు గాలిలోనే కాలిపోతాయని చెప్పారు.
ఉపగ్రహ శకలాలా?:మరోవైపు, మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో శాటిలైట్ విడిభాగాలు కనిపించాయి. సిందేవాహి తాలుకాలోని లద్బోరి గ్రామంలో వీటిని గుర్తించారు అధికారులు. వెంటనే శాస్త్రవేత్తల బృందం వచ్చి వీటిని స్వాధీనం చేసుకుంది. శనివారం రాత్రి భారీ శబ్దం వచ్చిందని.. ఏదో విమానం కూలినట్లు అనిపించిందని లద్బోరీ వాసులు చెప్పారు. పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే, ఉపగ్రహం విడిభాగాలు పడిపోయాయని ఉదయం నిపుణులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.11 గంటలకు న్యూజిలాండ్‌లోని మహియా ద్వీపకల్పంలో స్థానిక రాకెట్ ల్యాబ్ కంపెనీ.. బ్లాక్‌స్కై అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి కక్ష్యకు 430 కిలోమీటర్ల దూరంలో దీన్ని ప్రవేశపెట్టేందుకు యత్నించింది. అయితే, రాకెట్ 30-35 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ కాలిపోయిన శాటిలైట్ పరికరాలను సేకరించడానికి వ్యోమగాములు ఘటనాస్థలికి చేరుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:బైక్ ర్యాలీపై రాళ్ల దాడి.. 35 మందికి గాయాలు.. కర్ఫ్యూ విధింపు