Merits Of Dowry: మగవాళ్లతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కొన్ని చోట్ల వరకట్న సమస్య వెంటాడుతూనే ఉంది. కట్నం వేధింపులతో నిత్యం ఏదో ఒక చోట మహిళలు బలవుతూనే ఉన్నారు. అలాంటి వరకట్నానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సింది పోయి.. కట్నంతో ప్రయోజనాలు ఉన్నాయంటూ ఓ రచయిత్రి భాష్యం చెప్పడం గమనార్హం. ఆ పుస్తకాన్ని కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు కూడా.
నర్సింగ్ విద్యార్థులకు బోధించే సోషియాలజీ పుస్తకంలో 'వరకట్నంతో లాభాలు, ప్రయోజనాలు' పేరుతో ఉన్న పేజీ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. టీకే ఇంద్రాణీ అనే రచయిత్రి ఈ పుస్తకాన్ని రాశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్ నిబంధనల మేరకు దీన్ని రచించినట్లు పుస్తకం కవర్ పేజీపై రాసి ఉంది. ఇందులో ఒక పేజీలో వరకట్నంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని వివరించారు.
"అబ్బాయిల తల్లిదండ్రులు వరకట్నం తీసుకోవడానికి ముఖ్య కారణం.. వారు వారి కుమార్తెలు, అక్కాచెల్లెళ్లకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి రావడమే. అయితే ఈ వరకట్న వ్యవస్థ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కట్నం ఇవ్వడం వల్ల నూతన దంపతులు కొత్త కాపురాన్ని ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించవచ్చు. ఆడపిల్లలు తమ పుట్టింటి ఆస్తిలో వాటాను ఇలా కట్నం రూపంలో పొందుతారు. వరకట్నం వల్లే అమ్మాయిలను చదివించడం కూడా ఈ మధ్య పెరిగింది. అమ్మాయి చదువుకుని, ఉద్యోగం చేస్తే కట్నం డిమాండ్ కాస్త తగ్గుతుంది. ఇంకా.. కాస్త అందం తక్కువగా ఉన్న అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు అవుతాయి" అని ఆ పుస్తకంలో రాసి ఉంది.
ప్రస్తుతం ఈ పేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దీన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు. "మన విద్యా వ్యవస్థలో వరకట్నంతో ప్రయోజనాలున్నాయని చెప్పే ఓ పుస్తకం అందుబాటులో ఉండటం ఈ దేశానికి సిగ్గుచేటు. దీన్ని వెంటనే పాఠ్యాంశాల నుంచి తొలగించాలి" అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు.
ఇదీ చదవండి:వ్యర్థాలతో అందమైన కళాకృతులు.. యువ ఇంజనీర్ ప్రతిభ