OBC quota in NEET: వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేట్(పీజీ) సీట్ల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలకమైన తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన మైనార్టీ మెరిట్ జాబితా ప్రకారమే సీఎంసీ వెల్లూరులో 2021-22 విద్యాసంవత్సర పీజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) మెరిట్ జాబితా ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న తమిళనాడు ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలతో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవయ్‌ల ధర్మాసనం ఏకీభవించింది. మైనార్టీ విద్యార్థుల మెరిట్ జాబితాను తయారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పునూ అదనపు అడ్వొకేట్ జనరల్ ప్రస్తావించారు.
గత మూడేళ్లుగా తాము రూపొందించుకున్న మెరిట్ జాబితా ప్రకారమే పీజీ వైద్య విద్యలో ప్రవేశాలను కల్పిస్తున్నామని, ఇప్పుడు కూడా పాత విధానానికే అనుమతిస్తూ మధ్యంతర ఉపశమన ఉత్తర్వులివ్వాలన్న సీఎంసీ వెల్లూరు విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన మైనార్టీ మెరిట్ జాబితా ప్రకారమే సీట్లన్నిటినీ భర్తీ చేయాలని ఆదేశించింది.