Merchant Ship Drone Attack :భారత్‌కు వస్తున్న ఓ వాణిజ్య నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తుండగా గుజరాత్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు భారత కోస్ట్‌గార్డ్ వర్గాలు తెలిపాయి. పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. నౌకలో ముడి చమురు ఉన్నట్లు వెల్లడించాయి. దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్నిప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ వెంటనే ఐసీజీఎస్ విక్రమ్‌ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, అయితే నౌకకు కొంత మేర నష్టం జరిగినట్టు సమాచారం. అయితే, ప్రమాదానికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో నౌకను భారత నేవీకి చెందిన విక్రమ్ తీరానికి తీసుకురానుంది. విక్రమ్ నౌకను ఎస్కార్ట్‌గా పంపాలని ప్లూటో కోరగా పంపించినట్లు అధికారులు చెప్పారు. ప్లూటో డిసెంబర్ 25 నాటికి తీరానికి చేరుకుంటుందని వివరించారు.
"పోర్‌బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చింది. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్‌ను ఘటనాస్థలానికి పంపించాం. అక్కడకు వెళ్లిన విక్రమ్ వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, నౌక మాత్రం దెబ్బతింది. దీనికి సాయం చేసేందుకు ఈ ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్ అప్రమత్తం చేసింది."
--రక్షణ శాఖ అధికారులు
ఇతర నౌకలను అప్రమత్తం చేసిన నేవీ
ప్రస్తుతం భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల ఉన్న ఈ వాణిజ్య నౌకకు సాయం చేసేందుకు భారత నేవీకి చెందిన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.