తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mental Health: మానసిక రోగుల్ని అలా చూస్తారా!

ప్రభుత్వ మానసిక చికిత్సాలయాల్లో మహిళా రోగుల హక్కుల ఉల్లంఘనపై(Mental Health) అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. వారికి గుండు కొట్టించడం, శానిటరీ న్యాప్కిన్లు అందించకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాలని సూచించింది.

supreme court
సుప్రీంకోర్ట్​

By

Published : Sep 2, 2021, 5:16 AM IST

Updated : Sep 2, 2021, 6:35 AM IST

ప్రభుత్వ మానసిక చికిత్సాలయాల్లో(Mental Health) మహిళా రోగుల హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తంచేసింది. వారికి శిరోముండనం చేస్తుండడం, శానిటరీ నాప్కిన్లు అందించకపోవడం, ఏకాంతానికి ఆస్కారం కల్పించకపోవడం వంటివాటిపై రాష్ట్రాలతో కేంద్రం మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం(Supreme Court) బుధవారం ఆదేశించింది. మానసిక ఆసుపత్రుల్లో ఉన్నవారందరికీ నిర్ణీత కాలవ్యవధిలో కరోనా టీకాలు(Covid Vaccination) వేయించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వృద్ధాశ్రమాల పేరు మార్చివేసి ఇతరుల సంరక్షణ గృహాలుగానూ రాష్ట్రాలు వాడుతుండడంపై ఆక్షేపణ తెలిపింది. ఇలాంటి కంటితుడుపు చర్యలతో తమ ఆదేశాలను అమలు చేసినట్లు కాదని ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా స్పష్టీకరించింది. మహారాష్ట్రలో మానసిక ఆసుపత్రుల్లో కోలుకున్నవారిని యాచకుల వసతి కేంద్రాలకు తరలిస్తుండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మానసిక రుగ్మతల నుంచి కోలుకున్నవారికి కచ్చితంగా పునరావాసం కల్పించాలనీ, పేరు మారిస్తే చాలదని స్పష్టం చేసింది. తాత్కాలిక శరణాలయాల్లో సదుపాయాల లభ్యతపై రాష్ట్రాలు తమ సమాచారాన్ని పంచుకునేలా ఒక డాష్‌బోర్డును కేంద్రం ఏర్పాటు చేయవచ్చని సూచించింది. స్థాయీ నివేదిక దాఖలు చేయాలని ఆదేశించి, తదుపరి విచారణను డిసెంబరు నెలాఖరుకు వాయిదా వేసింది.

మెజారిటీ నిర్ణయమే చెల్లుబాటు

ప్రజాస్వామ్యంలో అత్యధికుల నిర్ణయమే చెల్లుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మహారాష్ట్రలోని ఒక పంచాయతీ సమితిలో కాంగ్రెస్‌ పక్ష నేత ఎన్నిక విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. పదవి నుంచి తొలగించడానికి నిర్దిష్ట విధానం లేనట్లయితే అప్పుడు.. మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయిన సందర్భంలో ఆ వ్యక్తి వైదొలగాల్సి ఉంటుందని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం పేర్కొంది. ప్రలోభాలను నిలువరించేలా ప్రజాస్వామ్యంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.

ఇదీ చూడండి:Viral Video: మాస్క్​ ధరించలేదని జవాన్​పై పోలీసుల దాడి!

Last Updated : Sep 2, 2021, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details