భూమిలోంచి నిధి వస్తుందని నమ్మిన పలువురు పూజలు ప్రారంభించారు. ఆ సమయంలో ఓ మహిళను వివస్త్రను చేసి నిలబెట్టారు. మూడవిశ్వాసాలు ఇంకా గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి అనడానికి ఉదాహరణ ఈ ఘటన. కర్ణాటకలోని రామనగర జిల్లా భుహల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని తమిళనాడుకు చెందిన పార్థసారధి, నాగరాజు, శశికుమార్, లోకేశ్, మోహన్, లక్ష్మీ నర్సప్పలుగా అధికారులు గుర్తించారు.
శశికుమార్ ఓ ఆలయ పూజారి కావడం గమనార్హం.
నిధి కోసం తవ్వకాలు జరిపిన నిందితులు ఇదీ జరిగింది..
సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నిధుల వేట ప్రారంభించిన నిందితులు.. భూహల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని మంగళవారం కలిశారు. అతని ఇంటి పరిసరాల్లో నిధి ఉందంటూ నమ్మించారు. భూమిలో ఉన్న నిధి బయటకు రప్పించేందుకు పూజలు చేయాలని.. అందుకు అతని భార్య ఆ సమయంలో నగ్నంగా నిల్చోవాలని చెప్పాడు పూజారి శశికుమార్. అందుకు శ్రీనివాస్ అంగీకరించగా.. అతని భార్య తిరస్కరించింది. మరో నిందితుడు పార్థసారధి రూ.50 వేలు ఇస్తానంటూ ఆశచూపేసరికి బాధితురాలు అందుకు ఒప్పుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు రాత్రి శ్రీనివాస్ ఇంటిని చేరుకోగా.. పూజలు నిర్వహిస్తున్న నిందితులు, వివస్త్రగా నిలిచిన మహిళ ఉన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చూడండి :వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించి..!