Mekedatu Padayatra: కరోనా కేసుల పెరుగుదలతో మేకెదాతు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా సీనియర్ నాయకులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక రామనగర నుంచి తమ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కీలక నేతలకు కరోనా..
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీకి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉన్నట్లు వీరిద్దరూ వేర్వేరు ప్రకటనల ద్వారా తెలిపారు.
హైకోర్టు ఆగ్రహం..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా భారీ స్థాయిలో పాదయాత్ర జరుగుతుండగా.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదయాత్ర నిర్వహణకు ఎందుకు అనుమతులిచ్చారని ప్రశ్నించింది. ఇదే విషయంపై కాంగ్రెస్ను కూడా నిలదీసింది. దీనిపై శుక్రవారం సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను ఆదేశించింది. దీంతో పాదయాత్రను నిలిపివేయాలని కాంగ్రెస్ను కోరారు సీఎం బసవరాజు బొమ్మై. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై సమష్టిగా పోరాడాలని సూచించారు.
కాంగ్రెస్ నిరసన..
Congress Withdraws Mekedatu Padayatra: రామనగర్ జిల్లాలో కావేరి నది పరివాహక ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జనవరి 9న పాదయాత్రను ప్రారంభించింది. దాదాపు 139 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించనుంది. పాదయాత్ర చివరి సమావేశాన్ని బెంగళూరులో జనవరి 19న నిర్వహించతలపెట్టింది. దీనికి బృహత్ బెంగళూరు మహానగరపాలిక(బీబీఎమ్పీ) నుంచి అనుమతులు కూడా పొందింది. ఈ ప్రాజెక్టుతో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీరు(4.75టీఎంసీ), 400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు గతం నుంచీ వ్యతిరేకిస్తోంది.
ఇదీ చదవండి:పంజాబ్ పోల్స్: ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్!
గోవా రణక్షేత్రంలో దీదీ పోరు- గెలిచి నిలిచేనా?