రాజస్థాన్‌లో తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృత్యువాతపడిన ఘటనపై ఆ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుల వ్యవస్థ జాడ్యాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఉద్ఘాటించారు. అందుకోసం పక్షపాతానికి తావులేనటువంటి ద్వేషరహిత విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కులం పేరుతో జరుగుతున్న ఇటువంటి దాడులను ఏదో ఒక ప్రభుత్వానికో, పార్టీకో ఆపాదించవద్దని.. అలా చేయడం వల్ల కుల వ్యవస్థ నిర్మూలన అంశం పక్కదారి పడుతోందని అభిప్రాయపడ్డారు.
కుల జాడ్యాన్ని తరిమికొట్టాల్సిందే, యువత ముందుకు రావాలి - దళిత బాలుడిపై దాడి
దేశంలో కుల వ్యవస్థ జాడ్యాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. కుల జాడ్యానికి రాజకీయాలు కూడా కొంతవరకు బాధ్యతే అయినా.. ఇదొక సామాజిక సమస్య అని పేర్కొన్నారు.
దళితులపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో ఏమైనా లోపం కనిపిస్తోందా అన్న ప్రశ్నకు మీరా కుమార్ బదులిచ్చారు. 'ఈ విషయంపై ప్రతిఒక్కరూ నన్ను అడుగుతున్నారు. నేను ఎవ్వరినీ ఆరోపించడంలేదు, ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు. దీనికి రాజకీయాలు కూడా కొంతవరకు బాధ్యతే అయినప్పటికీ ఇదొక సామాజిక సమస్య. రాజకీయాలు అంటేనే సమాజ ప్రతిబింబం' అని మీరా కుమార్ పేర్కొన్నారు. ఓ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతంలోనే, ఆయా రాష్ట్రాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడం సరికాదన్న ఆమె.. ఇటువంటి విషయాల్లో రాజకీయ కోణాలను మాట్లాడడం వల్ల సమస్య పక్కదారి పడుతుందన్నారు. వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఈ దురాచారాన్ని నిర్మూలించేందుకు సమాజం, ముఖ్యంగా యువత ముందుకు రావాలన్నారు.
రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తాగునీటి కుండను తాకాడన్న కారణంగా 9 ఏళ్ల దళిత విద్యార్థిని అక్కడి ఉపాధ్యాయుడు చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాజస్థాన్‌తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇటీవలే స్పందించిన మీరా కుమార్.. తన తండ్రి, దివంగత నేత బాబు జగ్జీవన్‌రామ్ కూడా వందేళ్ల క్రితం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. దళితుడనే కారణంగా తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని.. ఇటువంటి కుల వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని మీరా కుమార్ స్పష్టం చేశారు.