తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mehul Choksi: వేల కోట్లకు ట్రాప్ వేసిన అమ్మాయి!

వెంట వచ్చిన అమ్మాయే తనను మోసం చేసిందని ఆరోపించారు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ. తనను వలలో వేసి కిడ్నాప్​ చేయడానికి సహకరించిందని ఆంటిగ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Mehul Choksi girlfriend
మెహుల్ చోక్సీ హనీ ట్రాప్

By

Published : Jun 8, 2021, 11:32 AM IST

Updated : Jun 8, 2021, 12:53 PM IST

నమ్మిన అమ్మాయే తనను ట్రాప్‌ చేసి ఎత్తుకెళ్లటానికి సాయం చేసిందని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టి, దొరక్కుండా వెళ్లిన భారత నగల వ్యాపారి మెహుల్‌ చోక్సీ ఆరోపించారు. ఆంటిగ్వా నుంచి తనను స్థానిక పోలీసులు, కొంతమంది కిరాయి దుండగులు కిడ్నాప్‌ చేసి డొమినికాకు తీసుకొచ్చారన్నారు. ఈ మేరకు ఆంటిగ్వా రాయల్‌ పోలీసులకు చోక్సీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ తెలిపారు.

"బార్బరా జబరికా అనే అమ్మాయి నన్ను వలలో ఇరికించి కిడ్నాప్‌కు సాయం చేసింది. ఆంటిగ్వాలో కిడ్నాప్‌ చేసి... డొమినికాలో ఓ ఉన్నతస్థాయి భారత రాజకీయవేత్తకు ఇంటర్వ్యూ ఇప్పించేందుకు తీసుకొచ్చారు. తర్వాత వారి ప్రణాళిక మారినట్లుంది. నన్ను డొమినికా కోస్టుగార్డులకు అప్పగించారు. ఇంటర్‌పోల్‌ నోటీసున్న కారణంగా నన్ను అరెస్టు చేస్తున్నట్లు ఆ పోలీసులు చెప్పారు. బార్బరా జబరికా అనే అమ్మాయి నాకు ఏడాది కాలంగా తెలుసు. మా ఇంటివద్దే నివసించేది. గతనెల 23న సాయంత్రం ఇంటికొచ్చి తనను తీసుకెళ్లమని చెబితే వెళ్లాను. సాయంత్రం ఐదింటికి వెళ్లా. ఆ సమయంలో.. 10 మంది ఆంటిగ్వా పోలీసులుగా చెప్పుకొంటున్న బలమైన వ్యక్తులు నాపై దాడి చేసి కొట్టారు. వారికి కొంతమంది కిరాయి ఆగంతకులు... బహుశా భారతీయులు కావొచ్చు... కలిశారు. ఇదంతా జరుగుతుంటే బార్బరా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నాకేమాత్రం సాయం చేయలేదు. అంటే ఆమె కూడా వారితో కలసే నన్ను కిడ్నాప్‌ చేసినట్లున్నారు. పడవల్లో నన్ను ఆంటిగ్వా నుంచి డొమినికాకు చేర్చారు. నరీందర్‌సింగ్‌ అనే భారతీయ కిరాయి వ్యక్తి నాపై చేయి చేసుకున్నాడు. కేసులో సహకరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు."

- మెహుల్ చోక్సీ

భారతీయ బ్యాంకులకు సుమారు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన చోక్సీ పరారై... 2018 నుంచి ఆంటిగ్వాలో ఉంటున్నారు. ఇటీవలే ఆయనను పక్క దేశం డొమినికాలో పట్టుకున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్‌ చేశారనేది చోక్సీ ఆరోపణ. డొమినికా కోర్టులో బెయిల్‌కు కూడా చోక్సీ దరఖాస్తు చేశారు.

ఇదీ చూడండి:మెహుల్​ చోక్సీపై ఆంటిగ్వా వైఖరేంటి?

Last Updated : Jun 8, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details