పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసులను ఇంటర్‌పోల్ ఉపసంహరించుకుంది. ఛోక్సీ విజ్ఞప్తి మేరకు లియోన్‌లోని ఇంటర్‌పోల్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌పోల్‌కు చెందిన సీసీఎఫ్ (కంట్రోల్ ఆఫ్ ఇంటర్‌పోల్స్ ఫైల్స్) విభాగం 2022 నవంబర్లోనే ఆయన పేరును రెడ్ నోటీస్ జాబితా నుంచి తొలగించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.
"2022లో ఛోక్సీ ఇంటర్‌పోల్‌లోని సీసీఎఫ్‌ను ఆశ్రయించారు. ఐదుగురు సభ్యులు ఉన్న సీసీఎఫ్ ఛాంబర్.. వాస్తవాలను విస్మరించి ఆయన పేరును రెడ్ నోటీస్ నుంచి తొలగించాలని 2022 నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది. వారి నిర్ణయంలో లోపాలను గుర్తు చేసి, అదనపు సమాచారం అందించి.. రెడ్ కార్నర్ నోటీసులు పునరుద్ధరించేలా సీబీఐ చర్యలు తీసుకుంటోంది."
-సీబీఐ
ఇంటర్‌పోల్ సీసీఎఫ్లో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇంటర్‌పోల్ సెక్రెటేరియట్‌కు.. సీసీఎఫ్‌తో సంబంధం ఉండదు. అందులోని సభ్యులంతా వివిధ దేశాల నుంచి ఎంపికైన న్యాయవాదులే. రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేస్తే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో ఎక్కడున్నా నిందితులను పట్టుకుని, అరెస్టు చేసే అధికారం ఇంటర్‌పోల్ అధికారులకు ఉంటుంది. ఈ నిర్ణయంతో ఛోక్సీ ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది.
అంటిగ్వా పౌరసత్వం ఉన్న ఛోక్సీ.. 2021 మేలో ఆ దేశం నుంచి కనిపించకుండా పోయారు. ఒక్కసారిగా పొరుగు దేశమైన డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారన్న కారణంతో ఆయన్ను స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనను భారత అధికారులే కిడ్నాప్ చేశారని ఛోక్సీ ఆరోపిస్తున్నారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు రద్దు కావడం వల్ల.. ఛోక్సీ వాదనకు బలం చేకూర్చినట్లైందని ఆయన ప్రతినిధి పేర్కొన్నారు.