దేశంలోని భాజపాయేతర పార్టీలకు లేఖ రాసిన బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు పలికారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ప్రజాస్వామ్యాన్ని, దాని విలువలను రక్షించుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావటం అత్యవసరమని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
మమతా బెనర్జీకి మద్దతుపలుకుతూ రాసిన లేఖను తన ట్వీట్‌కు జత చేశారు ముఫ్తీ. భాజపా చర్యలకు.. దిల్లీ (సవరణ)బిల్లు మరో ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే.. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజనను సూచిస్తూ ఆరోపణలు చేశారు.
" భారత రాజ్యాంగం కల్పించిన సమాఖ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందనే మీ భయాలను నేను అర్థం చేసుకున్నాను. భాజపా తన మెజారిటీని ఉపయోగించి బిల్లులను ఎలా ఆమోదించుకుంటోంది, ప్రత్యర్థులను ఎలా తోసిపుచ్చుతోందో ఇటీవలి జీఎన్సీటీడీ బిల్లు సూచిస్తోంది. ఇది 2019లో జమ్ముకశ్మీర్‌ను విభజించటంతో మొదలైంది. "