జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం తనను, తన కుమార్తె ఇల్తీజాను మరోసారి గృహ నిర్బంధం చేసిందని ఆరోపించారు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. పుల్వామాలోని వహీద్ పర్రా కుటుంబాన్ని కలిసేందుకు.. రెండురోజులుగా తమకు అనుమతినివ్వడం లేదని అన్నారు. వహీద్ పర్రాను నిరాధార ఆరోపణలతో ఎన్ఐఏ అరెస్టు చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.
"నన్ను మరోసారి అక్రమంగా గృహ నిర్బంధం చేశారు. వాళ్ల క్రూరత్వానికి అదుపు లేదు. వహీద్ పర్రాను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారు. పుల్వామాలోని వహీద్ కుటుంబ సభ్యులను కలిసేందుకు జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం రెండు రోజులుగా అనుమతించటం లేదు. భాజపా మంత్రులు, కార్యకర్తలు కశ్మీర్లో ఎక్కడికైనా వెళ్లగలరు. కానీ, నా విషయంలో మాత్రమే వారికి భద్రతా సమస్యలు ఎదురొస్తాయి. నా కుమార్తె ఇల్తీజాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు."
--మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి