మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర క్రీడా శాఖ ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే స్పందించారు.
"పీఏ సంగ్మా స్టేడియంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం సరికాదు. స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అక్కడ మైదానంలో నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. అందుకు ప్రధాని మోదీ సభకు అనుమతివ్వలేదు. పత్యామ్నాయ వేదికగా అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియం పరిశీలిస్తున్నాం.
-- స్వప్నిల్ టెంబే, జిల్లా ఎన్నికల అధికారి
మోదీ సభకు అనుమతి నిరాకరణను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. 'పీఏ సంగ్మా స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అందుబాటులో లేదని ఎలా చెబుతారు. కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా బీజేపీని చూసి భయపడుతున్నారు. వారు మేఘాలయలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధాని ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు.. కానీ మేఘాలయ ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు తమ మనసును మార్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల ర్యాలీలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బీజేపీని రాష్ట్రంలో ఎదగకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి.' అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రుత్‌రాజ్ సిన్హా విమర్శించారు.