దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాళ్లు మారడోనా, పీలే, రొమారియో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదేంటీ ఫుట్‌బాల్ దిగ్గజాలు మేఘాలయలో ఓటు వేస్తున్నారని అనుకుంటున్నారా? అదేం కాదండి మేఘాలయలోని ముగ్గురు ఓటర్ల పేర్లు అవి. అయితే.. మేఘాలయలో మాజీ ఫుట్‌బాల్ స్టార్లతో పాటు అమెరికా గాయకుడు జిమ్ రీవ్స్ అనే పేరున్న వ్యక్తి కూడా మేఘాలయలో ఓటు హక్కు కలిగి ఉన్నారు.
మేఘాలయలో ఓటు వేయనున్న పీలే, మారడోనా, రొమారియో!
మేఘాలయలో సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఓటర్ల లిస్ట్‌లో కొందరి పేర్లు భలే డిఫరెంట్‌గా ఉన్నాయి. పీలే, మారడోనా, రొమారియో అనే పేర్లున్న వ్యక్తులు శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పేర్లు కూడా భిన్నంగా, ఆసక్తికరంగా ఉన్నాయి.
అలాగే ఎన్నికల బరిలో ఉన్న కొందరు అభ్యర్థుల పేర్లు విచిత్రంగా ఉన్నాయి. నార్టియాంగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వ్యక్తి పేరు 'జనెరస్ పాస్‌లెయిన్', జౌవాయ్ స్థానం నుంచి 'మూన్‌లైట్ పారియట్' అనే వ్యక్తి యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అధికార ఎన్‌పీపీ రెలియాంగ్ నియోజకర్గ స్థానం నుంచి 'కమింగ్ వన్ యంబాన్' అనే సీనియర్ నేతను బరిలోకి దింపింది. అమలారెమ్ నియోజవర్గం నుంచి బీజేపీ తరఫున 'ఫస్ట్ బోర్న్ మేనర్' అనే వ్యక్తి బరిలోకి దిగుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులకు ఆయనే మొదటి సంతానం కావడం వల్ల ఆ పేరు పెట్టుకున్నారట.
ఉమ్మాత్మార్ గ్రామంలో చాలా మంది ఆంగ్లం పేర్లనే తమ పిల్లలకు పెడతారు. తమ పిల్లలకు విభిన్నమైన పేర్లను పెట్టేందుకు అక్కడివారు ఇష్టపడతారట. అలాగే అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న స్లీపీ ఎలకలో 749 మంది పురుష ఓటర్లు, 785 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం రికార్డుల్లో చాలా మంది పేర్లు విచిత్రంగా ఉన్నాయి. థర్స్డే, సండే అనే పేర్లు ఉన్న ఓటర్లు కూడా ఉన్నారు. దిస్పుర్, అట్లాంటా, టేబుల్, ఫోర్టిన్, సండే, వీనస్, జూపిటర్ అనే పేర్లు గల ఓటర్లు ఉన్నారు. మస్టరడ్, రాడిశ్, అట్వాస్, నేవీ ఇలా విభిన్నమైన పేర్లు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు.