Meghalaya Congress News: మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలోని ఐదుగురు ఎమ్మెల్యేలు కాన్రాడ్ కే సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ (ఎండీఏ)లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మాకు లేఖ అందజేశారు.
కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అంపరీన్ లింగ్డో, మేరాబోర్ సీయం, మోహెన్డ్రో రాప్సాంగ్, కిమ్ఫా మార్బనియాంగ్, పీటీ సాక్మి ఎండీఏలో చేరుతున్నట్లు లేఖ ద్వారా వెల్లడించారు. ఇదే లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా పంపారు.
" మేఘాలయ డెమొక్రటిక్ కూటమిలో చేరాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. మా మద్దతుతో ఎండీఏ మరింత బలపడుతుందని, రాష్ట్రాన్ని ముందుకుతీసుకెళ్తుందని, ప్రజల ఆశయాలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం." అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలంతా ఎండీఏలో చేరడం వల్ల.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షం అయింది.