తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Electric Cars Factory Telangana : తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కేంద్రం - హైదరాబాద్​లో కరెంట్ కార్ల తయారీ కేంద్రం

Megha plans Electric Cars Factory Telangana : తెలంగాణకు త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కేంద్రం రానుంది. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తన చైనా భాగస్వామి బీవైడీతో కలిసి రాష్ట్రంలో విద్యుత్తు కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి దాదాపు రూ.8,200 కోట్లతో తయారీ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Electric
Electric

By

Published : Jul 15, 2023, 2:01 PM IST

Megha plans to set up Electric Cars Factory Telangana :తెలంగాణలో విద్యుత్తు కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మౌలిక వసతుల నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తన చైనా భాగస్వామి బీవైడీతో కలిసి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి దాదాపు రూ.8,200 కోట్ల (1 బిలియన్‌ డాలర్ల) పెట్టుబడి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయా సంస్థలు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నాయి.

Electric Cars and Batteries Factory in Telangana :విద్యుత్తుతో నడిచే హ్యాచ్‌బ్యాక్‌ నుంచి విలాసవంత కార్ల వరకు నూతన ప్లాంటులో తయారు చేయాలన్నది ప్రతిపాదనగా చెబుతున్నారు. విద్యుత్తు కార్లకు సంబంధించి పరిశోధన-అభివృద్ధి కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా ఈ ప్రతిపాదనలో భాగమేనని చెబుతున్నారు. దాదాపు రూ.41,000 కోట్ల (5 బి.డాలర్ల) విలువ కలిగిన ఎంఈఐఎల్‌ ఇప్పటికే పలు రకాల వ్యాపారాల్లో నిమగ్నమై ఉంది. బీవైడీతో కలిసి చేసిన తాజా ప్రతిపాదనపై ఈ సంస్థ అధికారికంగా స్పందించలేదు. ‘ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. దీనికి అంగీకారం రాగానే, పనులు ప్రారంభం అవుతాయ’ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

ఇప్పటికే బస్సు ప్లాంటు : దేశవ్యాప్తంగా విద్యుత్‌ బస్సులకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఇప్పటికే హైదరాబాద్‌ సమీపంలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎకరాల స్థలాన్ని తీసుకోవడంతో పాటు, ప్లాంటు నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు అప్పగించింది కూడా. ఏడాదికి 10,000 విద్యుత్తు బస్సులను తయారు చేసే సామర్థ్యంతో, రోబోలే అత్యధిక కార్యకలాపాలు నిర్వహించేలా పూర్తి యాంత్రీకరణ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ఒలెక్ట్రా గతంలోనే వెల్లడించింది. విద్యుత్తుతో నడిచే టిప్పర్లు, ట్రక్కులను కూడా సంస్థ ఇప్పటికే ఆవిష్కరించింది కూడా. కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులన్నీ రాగానే.. ఎంఈఐఎల్‌, బీవైడీ ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, కార్ల ప్లాంటుకు భూమిని కేటాయించాల్సిందిగా కోరనున్నాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు బీవైడీ సాంకేతిక భాగస్వామిగా ఉంది.

టెస్లా ప్లాంటు వార్తల నేపథ్యంలో..: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, మనదేశంలో విద్యుత్తు కార్ల ప్లాంటు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా దిగ్గజ సంస్థ బీవైడీ కూడా ముందుకొచ్చిందని అంటున్నారు. బ్లేడ్‌ బ్యాటరీల తయారీలో ఇది అగ్రగామి సంస్థ. ఇప్పటికే బీవైడీ మనదేశంలో 20 కోట్ల డాలర్ల (సుమారు రూ.1640 కోట్ల) పెట్టుబడి పెట్టడంతో పాటు, విద్యుత్తు ఎస్‌యూవీ ఆటో 3, ఈ6 మోడళ్లను విక్రయిస్తోంది కూడా. విలాసవంత సెడాన్‌ సీల్‌ను ఈ ఏడాది విడుదల చేయాలన్నది సంస్థ ప్రణాళిక.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details