Young Girl Wrote 4 Books :16 ఏళ్ల వయసులోనే నాలుగు పుస్తకాలు రాసి ఔరా అనిపిచింది ఓ అమ్మాయి. సాహిత్యంపై మక్కువ పెంచుకుని ఇంగ్లిష్, హిందీ భాషల్లో 500కు పైగా కవితలు రాసింది. వాటిని నాలుగు కవితా సంపుటాలుగా వెలువరించింది. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన ఈ అమ్మాయి పలు ప్రతిష్టాత్మక రికార్డులు సైతం సొంతం చేసుకుంది. ఆమెనే కర్ణాటకకు చెందిన అమన. జె. కుమార్.
కేఎస్ఆర్టీసీ సీపీఆర్ఓ డాక్టర్ లత టీఎస్, జైవంత్ కుమార్ దంపతుల కుమార్తె అమన. సాహిత్యంపై ఇష్టం పెంచుకున్న అమనా ఆరో తరగతిలోనే కవితలు రాయడం మొదలుపెట్టింది. అలా కొన్ని కవితలు రాశాక వాటిని ప్రచురించాలనుకుంది. 'ఈకోస్ ఆఫ్ సోల్‌ఫుల్ పోఎమ్స్' అనే శీర్షికతో మొదటి కథా సంపుటిని వెలువరించింది. ఆ తర్వాత 'వరల్డ్ అమిడ్స్ట్ ది వర్డ్స్' అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఇక హిందీలో రాసిన మూడో కవితా కంపుటిని 'లఫ్రోన్ కీ మెహ్ఫిల్' అనే పేరుతో తీసుకొచ్చింది. ఈ సమయంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 'మాస్టర్‌పీస్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్' అనే కోర్సును పూర్తి చేసింది.
Amana J Kumar Fourth Book : ప్రస్తుతం బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికళ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమన తాజాగా నాలుగో పుస్తకం కూడా రాసింది. 'గాలోర్ ఆఫ్ మిస్టరీస్' అనే ఈ పుస్తకాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సంతోశ్ హెగ్డే విడుదల చేశారు. 'ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి పుస్తకం. పాఠకులు ఈ పుస్తకాన్ని అభినందిస్తారు' అని విశ్వాసం వ్యక్తం చేశారు.