కరోనా రెండో దశ వ్యాప్తితో దేశం గడగడలాడిపోతోంది. వైరస్ విజృంభణకు ఆరోగ్యంగా ఉన్న యువతే బెంబేలెత్తిపోతుంటే.. కొంత మంది వృద్ధులు మాత్రం తమ మనోబలంతో వైరస్‌ను తరిమికొడుతున్నారు. వారి సంకల్పం ముందు మహమ్మారి తోక ముడుచుకుని పారిపోతోంది. వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న అలాంటి కొందరి విజయగాథలను ఇప్పుడు చూద్దాం.
రామనవమి రోజున పునర్జన్మ..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌కు చెందిన 96 ఏళ్ల శాంతి భాయ్ అనే బామ్మకు ఇటీవల కరోనా నిర్ధరణ అయింది. దాంతో ఆమె ఏప్రిల్ 8న ఇందోర్‌లోని ఇండెక్స్ వైద్య కళాశాలలో చేరారు. వైరస్ ఆమె ఊపిరితిత్తుల్లోకి వైరస్ 80 శాతం మేర వ్యాపించింది. పరిస్థితి విషమించగా... ఆమెకు ఆక్సిజన్‌ను అందించారు. అయినప్పటికీ.. ఆమె తన దృఢనిశ్చయంతో వైరస్‌ను తన ఒంట్లో నుంచి తరిమేశారు. మహమ్మారిపై విజేతగా నిలిచారు. యాదృచ్ఛికంగా ఆమె పుట్టినరోజు నాడే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.
1925లో శ్రీరామనవమి రోజున శాంతిబాయ్ జన్మించారు. ఈ ఏడాది అదే శ్రీరామనవమి రోజన శాంతి బాయ్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
96 ఏళ్ల వయస్సులో రెండుసార్లు..
మహారాష్ట్ర బీద్ జిల్లాలోని అదాస్ ప్రాంతానికి చెందిన 90ఏళ్ల పాండురంగ ఆత్మారామ్ అగ్లావే గతేడాది నవంబరులో తొలిసారి కరోనా బారినపడ్డారు. 10 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఏప్రిల్ తొలివారంలో పాండురంగకు మరోసారి కొవిడ్ సోకింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించగా.. స్వామి రామానంద్ తీర్థ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైరస్ నుంచి కోలుకుని ఏప్రిల్ 17న డిశ్చార్జ్ అయ్యారు.
తొలిసారి కంటే రెండోసారి కోలుకోవడం కాస్త కష్టంగానే అనిపించిందని పాండురంగ చెప్పారు. అయినప్పటికీ ధైర్యాన్ని వీడకపోవడం వల్ల క్షేమంగా బయటపడగలిగానని తెలిపారు.
76 ఏళ్ల వయస్సు.. ఆక్సిజన్ స్థాయి 77