శివాలయంలో భక్తి గీతాలు ఆలపించాలనే ఓ తమిళనాడు మహిళ కల సాకారమైంది. చెన్నై శివారు మదంబక్కంలోని చోళుల కాలం నాటి గుడిలో ఒథువార్గా ఎంపికైంది. రాష్ట్రంలో ఈ అవకాశం దక్కించుకున్న రెండో మహిళగా నిలిచింది.
సాధారణంగా పురుషులు మాత్రమే ఈ వృత్తిలో ఉంటారు. అయితే డీఎంకే ప్రభుత్వం అధికారంలో వచ్చాక తమిళనాడులోని అన్ని గుళ్లలో పురోహితులు సహా ఇతర బాధ్యతలు నిర్వహించే అవకాశం మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తోంది.
ఒథువార్గా ఎంపికైన ఈ 28 ఏళ్ల మహిళ పేరు సుహంజన. చిన్నప్పటి నుంచే సంగీతం, భక్తి గీతాలంటే అమితాసక్తి. అందుకే డిగ్రీనో, ఇంజినీరింగో చదవకుండా ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరింది. దైవ భక్తి గీతాలు, సంప్రదాయ సంగీతంలో మంచి నైపుణ్యం సాధించింది. ఒథువార్గా ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టిన సుహంజన.. గాత్రం చూసి నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు. తొలిరోజు ఆమె ఆలపించిన శివ భక్తి గీతాన్ని తెగ షేర్ చేశారు. దీంతో అది వైరల్గా మారింది.
ఒథువార్లు అంటే పురోహితులలాగా మంత్రాలు చదవరు. దేవునికి అభిషేకం చేశాక భక్తి గీతాలు ఆలపిస్తుంటారు.
" చిన్నప్పుడు గుళ్లలో ఉత్సవాలు నిర్వహించినప్పుడు, ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు దైవభక్తి గీతాలు పాడేదాన్ని. విద్యార్థి దశలో అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటే నేను మాత్రం సంగీతానికి సంబంధించిన వృత్తిలో స్థిరపడాలనుకున్నా. మా నాన్న ఉద్యోగ రిత్యా మా కుటుంబం కరూర్ జిల్లా వెలాయుథంపలాయంలో ఉండేది. దైవభక్తి వైపు మళ్లాక తమిళ సంగీతంలో నైపుణ్యం సాధించాలనుకున్నా. నా తల్లిదండ్రులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. కరూర్లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోనే చేరా. కుమార స్వామినాథన్ దగ్గరు తేవరం, తిరవసాగం నేర్చుకున్నా. ఒథువార్లుగా మహిళలు ఉండరని, ఈ సంప్రదాయన్ని తదుపరి తరానికి కొనసాగించాలని ఆయన చెప్పేవారు. "
-సుహంజన