Sumnima Udas: నేపాల్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఓ నైట్ క్లబ్‌కు వెళ్లినట్టు బయటకొచ్చిన దృశ్యాలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకొనే నాయకుడు నైట్‌క్లబ్‌ల్లో తిరగడమేంటంటూ భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. వ్యక్తిగత పర్యటనలపై విమర్శలేంటని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు, తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఐదు రోజుల పర్యటనకు సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. తన నేపాలీ స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి రాహుల్ వెళ్లినట్టు అక్కడి మీడియా పేర్కొంది. భారత్‌కు చెందిన మరికొందరు వీఐపీలు కూడా హాజరవుతున్నట్టు తెలిపింది. అసలు ఎవరీ సుమ్నిమా ఉదాస్? ఆమె గురించి కొన్ని వివరాలు..
సుమ్నిమా ఉదాస్ ఓ పాత్రికేయురాలు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌కు దిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ గ్యాంగ్‌రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాలపైనా ప్రముఖంగా కథనాలను రాశారు. ఆమె లింక్డ్ ఇన్ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం.. 2001 నుంచి 2017వరకు సీఎన్‌ఎన్‌లో పనిచేసిన సుమ్నిమా.. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు.