ఆర్య రాజేంద్రన్...! తిరువనంతపురం మేయర్ ..! దేశంలోనే అతి చిన్న వయసులోనే ఓ నగర మేయర్ పదవి చేపట్టి యువతలో స్ఫూర్తి నింపిన వ్యక్తి. వయస్సు 21 ఏళ్లు. చదువుతున్నది డిగ్రీ రెండో సంవత్సరం. తన కుటుంబానికి ఏ విధమైన రాజకీయ చరిత్ర లేదు. స్థితిమంతులూ కాదు. అయితేనేం వీటన్నింటిని అధిగమించిన ఆర్య రాజేంద్రన్ రాజకీయాలను ఈసడించుకుంటున్న నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.
చిన్ననాటి నుంచే..
ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్. తల్లి శ్రీలత ఎల్ఐసీ ఏజెంట్. ఆరేళ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే బాలసంఘంలో ఆర్య చేరారు. ఆసియాలోనే అత్యధికమంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ఆర్యలో స్వతంత్ర భావాలను ఇనుమడించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే కళాశాలలో విద్యార్థి నాయకురాలుగా ఎదిగారు. మరోవైపు బాలసంఘం తరఫున కూడా చురుగ్గా సేవలందిస్తుండటంతో సీపీఎమ్.. ఈమెను బాలసంఘానికి కేరళ అధ్యక్షురాలిగా నియమించింది. ఆర్య దృష్టి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులపై పడింది. వారిని బృందాలుగా తయారుచేసి గ్రామీణ సమస్యలపై పోరాడేలా ఆమె కృషి చేశారు. గ్రామాభివృద్ధి అంశాలను పాలకుల ఎదుట ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేలా వారిలో ఉత్సాహం, ధైర్యాన్ని తీసుకురాగలిగారు.