'మనసుంటే మార్గముంటుంది' అని రుజువు చేశాడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు. చదువుపై తనకున్న మక్కువతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలని ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ఇంటి నుంచి పాఠశాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గుర్రంపై వెళ్తున్నాడు.
బిలాస్‌పుర్‌కు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న బెల్గహనాలోని జర్గా గ్రామానికి చెందిన మనీశ్ యాదవ్.. ఐదో తరగతి చదువుతున్నాడు. ఊరిలో బడి లేకపోవడం వల్ల చదువుకోవడానికి 10 కిలోమీటర్లు వెళ్లాలి. ఆ ఊరికి బస్సులు, ఆటోలు వంటి వాహనాలు వెళ్లవు. దీంతో ఎలాగైనా స్కూల్‌కు వెళ్లాలని.. గుర్రపు స్వారీ మొదలుపెట్టాడు మనీశ్.
యాదవ్.. రోజూ గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తాడు. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి బెల్గహనాలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తాడు. ఈ క్రమంలోనే గుర్రపు స్వారీని ఆస్వాదిస్తానని మనీశ్ చెబుతున్నాడు. ఈ బాలుడికి చదువుపై ఉన్న మక్కువను చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు.