తమిళనాడు చెన్నైలో ఓ యోగా టీచర్ 10 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బస్‌స్టాప్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం పెరుంగళత్తూరులో జరిగింది. కేరళకు చెందిన దినేశ్ అనే వ్యక్తి బరువైన బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే దినేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
ఒత్తిడికి గంజాయే మందట..! స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన యోగా టీచర్..
ఓ యోగా గురువు భారీ మొత్తంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసోంలో జరిగిన మరో ఘటనలో ఓ డ్రగ్ స్మగ్లర్‌కు జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
దినేశ్ యోగాలో పీజీ పూర్తిచేశాడు. ప్రస్తుతం పాలవక్కాంలో ఉంటూ వేలచేరి, నీలంగరై, దురైపాకంలోని జిమ్‌లలో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దినేశ్ వద్ద శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే. వారిలో కొందరు ఒత్తిడి, బరువు తగ్గాలంటూ దినేశ్ సంప్రదించేవారు. అయితే వారికి గంజాయిని తీసుకోవడం ద్వారా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని సూచించేవాడు. దీంతో తన వినియోగదారులకు గంజాయిని అందించడం కోసం స్వయంగా తానే స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు.
డ్రగ్ స్మగ్లర్‌కు 20 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు
అసోంలో ఓ డ్రగ్ స్మగ్లర్‌కు జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగాన శిక్షను విధించింది. నాగోన్ జిల్లా కోర్టు జడ్జి నీల్కమల్ నాథ్ నిందితుడికి శనివారం ఉదయం ఈ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. 2020 డిసెంబర్లో నాగోన్ పోలీసులు హబిల్ అలీ అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు. ఆ దాడుల్లో 2 కేజీల హెరాయిన్, 100 కేజీల గంజాయి, కేజీ నల్లమందు, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతో రెండేళ్ల తర్వాత నిందితుడికి జిల్లా కోర్టు.. 20 ఏళ్ల శిక్షతో పాటుగా రూ.3 లక్షల జరిమానా విధించింది. ఆ రూ.3 లక్షలు చెల్లించకోపోతే మరో 18 నెలలు జైలు శిక్ష అనుభవించాలని సూచించింది.