బిహార్‌లో జరిగిన నగర పంచాయితీ ఎన్నికల్లో 21 ఏళ్ల మెడికల్ విద్యార్థిని జయకేతనం ఎగురవేసింది. అరారియా జిల్లాలో 5 సార్లు ఎంపీగా గెలుపొందిన సుకుదేవ్ పాశ్వాన్ భార్యపై పోటీ చేసి విజయం సాధించింది. ఎంతో మంది సీనియర్ నాయకులతో పోటీ పడి మరీ గెలుపొందింది సన్ను కుమారి. ఆమె సాధించిన ఈ విజయం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
నగర పంచాయితీ ఎన్నికల్లో 'మెడికో' సత్తా.. మాజీ ఎంపీ భార్యపై విజయం.. 21 ఏళ్లకే చీఫ్ కౌన్సిలర్‌గా.. - 2022 బిహార్ మున్సిపల్ ఎన్నికలు
బిహార్ నగర పంచాయితీ ఎన్నికల్లో 21 ఏళ్ల ఓ వైద్య విద్యార్థిని సత్తా చాటింది. ఎంపీ భార్యతో సహా మరికొందరు సీనియర్ నాయకులతో పోటీ పడి మరీ.. 2193 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఆ యువతి సాధించిన విజయం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

సన్ను కుమారి ప్రస్తుతం దర్భంగా మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. సన్ను తండ్రి ఇంద్రానంద్ పాశ్వాన్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కాగా తల్లి బెలిబారి సేవిక గృహిణి. నర్పత్గంజ్ పంచాయితీలో చీఫ్ కౌన్సిలర్ పదవిని ఈ సారి ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో కొత్తగా ఏర్పడిన ఈ పంచాయితీలో సన్ను కుమారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో దిగింది. డిసెంబర్ 28న నర్పత్గంజ్ నగర పంచాయితీలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. శుక్రవారం పటిష్ఠ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడగా.. సన్ను కుమారి తన సమీప ప్రత్యర్థి సీమా కుమారిపై 2193 ఓట్ల తేడాతో గెలుపొందారు. సీమా కుమారికి 3300 ఓట్లు రాగా.. సన్నుకు 5493 ఓట్లు వచ్చాయి. దీంతో సన్ను కుమారి చీఫ్ కౌన్సిలర్ పదవిని చేపట్టనుంది. అయితే ఎంపీ భార్య అయిన.. నీలందేవికి 1206 ఓట్లు మాత్రమే వచ్చాయి.
"ఇది నా ఒక్కరి విజయం కాదు. నర్పత్గంజ్ ప్రజలందరి విజయం. నగరపంచాయితీలో ఆరోగ్యం, విద్య వంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటి అధిగమించి అభివృద్ధి చేయడమే నా మొదటి ప్రాధాన్యత. దేశానికి యువతే వెన్నెముక. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితులను పరిష్కరించడానికి యువతరం శక్తి,ఉత్సాహం చాలా అవసరం. యువతే సమాజాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. వారే భావితరాలకు వారధి".
-- సన్ను కుమారి, చీఫ్ కౌన్సిలర్, నర్పత్గంజ్