Khammam Medical Student Suicide :ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ఓ దంత వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని తన రూమ్‌లో ఒంటిపై పెట్రోల్ ఆత్మహత్యకు పాల్పడింది. గది నుంచి మంటలు రావడం గమనించిన తోటి విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేసినా.. ప్రాణాలు దక్కలేదు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రాథమిక ఆధారాలను బట్టి విద్యార్థిని సూసైడ్ చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
Khammam Dental Student Suicide News : ఖానాపురం హవేలీ సీఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన మానస (22) ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌మెడికల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఎదురుగా ఉన్న ప్రైవేట్ హాస్టల్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న గదిలో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం మానస గది నుంచి పొగలు వస్తుండటంతో ఇతర విద్యార్థినులు, హాస్టల్ నిర్వాహకులు వచ్చి చూశారు. లోపలి నుంచి కాలిపోయిన వాసన వస్తుండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మానస మంటల్లో కాలిపోతుండగా.. కాపాడేందుకు ఆమెపై నీళ్లు చల్లారు. ఆ ప్రయత్నాలు ఫలించక మానస అక్కడికక్కడే మృతి చెందింది.
సీసీ ఫుటేజీల్లో పెట్రోల్ తీసుకెళ్తున్న దృశ్యాలు..: సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు ముందు మానస గది నుంచి కేకలు వినిపించినట్లు కొందరు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే హాస్టల్ సమీపంలోని ఓ బంకు నుంచి మానస పెట్రోల్ కొని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు వాటిని పరిశీలించారు.
పోస్టుమార్టం అనంతరం.. మానస మృతదేహాన్ని హనుమకొండలోని పోచమ్మ కుంట శ్మశానవాటికకు తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మానస తల్లి చిన్నప్పుడే మరణించగా.. తండ్రి 2008లో చనిపోయాడు. దీంతో పిన్ని వద్దే పెరిగిన మానస.. ఖమ్మంలో దంత విద్య చదువుతోంది. ఇటీవలే చెల్లెలు పుట్టినరోజుకు వచ్చి సంతోషంగా గడిపి తిరిగి వెళ్లిన మానస.. పది రోజులకే విగతజీవిగా తిరిగిరావడాన్ని చూసి ఆమె కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మానసకు అనారోగ్యం, ఇతరాత్ర సమస్యలేమి లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు గల కారణాలు బయటికి రాలేదు. మానస ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే.. విద్యార్థి మానస తండ్రి ఇటీవలే మృతి చెందగా.. అప్పటి నుంచి ఆమె తరచూ ఆయనను తలచుకుని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 2, 3 రోజులుగా మానస తన తోటి విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి మాట్లాడి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఖానాపురం హవేలీ సీఐ తెలిపారు. విద్యార్థినిది ఆత్మహత్యేనని భావిస్తున్నామని, ఆమె గదిలో ఎలాంటి లేఖ దొరకలేదని వెల్లడించారు.
3 నెలల క్రితం నిజామాబాద్‌లో..: మూడు నెలల క్రితం నిజామాబాద్ జిల్లాలోనూ ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న సనత్.. అమ్మా నాన్నా ఐయామ్ సారీ.. అన్నా.. నేను చనిపోతున్నా.. నువ్వు అమెరికా నుంచి వచ్చేయ్ అంటూ కుటుంబసభ్యులకు వాట్సప్‌లో మెసెజ్ పెట్టి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇవీ చదవండి :ప్రీతి ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆ హానికారక ఇంజెక్షన్ ఏంటి..?
అమ్మా నాన్నా ఐయామ్ సారీ.. అన్నా.. నేను చనిపోతున్నా.. నువ్వు అమెరికా నుంచి వచ్చేయ్