వివాదాల పరిష్కారానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ అనుసరణీయ విధానాల్లో 'మధ్యవర్తిత్వం' ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. బ్రిటషర్లు, వారి కోర్టుల వ్యవస్థ రాక ముందునుంచే మన దేశంలో ఈ విధానం ఉందని గుర్తుచేశారు. భవిష్యత్తులో అది మరింత ఆదరణ పొందబోతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వద్ద శిక్షణ పొందిన మధ్యవర్తుల (నివారణ్) ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఇంటర్నేషనల్ వర్చువల్ మీడియేషన్ సమ్మర్ స్కూల్-2021'ను ఉద్దేశించి సీజేఐ గురువారం ప్రసంగించారు.
"బ్రిటిష్ పాలకులు ఆధునిక భారత న్యాయవ్యవస్థకు రూపకల్పన చేశారు. అదే సమయంలో.. వివాద పరిష్కారానికి, న్యాయం పొందేందుకు విస్తృత వాదనలు అవసరమన్న అపోహ అవతరించడానికీ వారు కారకులయ్యారు. భారత్‌లో అత్యధిక మంది కక్షిదారులు పలు సామాజిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వేగంగా, తక్కువ ఖర్చులో, అనువైన మార్గంలో వివాదాలు పరిష్కారమవడం వారికి కావాలి. అందుకు మధ్యవర్తిత్వం ఉత్తమమైనది. కోర్టులను ఆశ్రయించినప్పుడు సాధారణంగా ఏదో ఒక పక్షానికి తీర్పుపై అసంతృప్తి ఉంటుందని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. అందుకే వారు సుప్రీంకోర్టు వరకూ అప్పీలు చేసుకుంటూ వస్తుంటారు. ఇదంతా న్యాయం జరగడంలో జాప్యానికి కారణమవుతుంటుంది. 'గెలిచినవారికే మొత్తం' అన్న దృక్పథం ఫలితమిది. మధ్యవర్తిత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుంది. అన్ని పక్షాలకూ మెరుగైన ఫలితాన్ని అందించడంపై అది దృష్టిసారిస్తుంది. వివాదం పరిష్కారమయ్యాక సంబంధాలను కొనసాగించేలా ఆలోచింపజేస్తుంది.
-జస్టిస్ ఎన్‌వీ రమణ, సీజేఐ
అవసరమైనన్ని వనరులు, తగినంత సమయం లేని కక్షిదారులకు.. కోర్టుల్లో దావాలు వేసే సంప్రదాయ వ్యూహం కష్టతరంగా మారుతుందని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. అలాంటివారు మధ్యవర్తిత్వంతో వేగంగా, తక్కువ ఖర్చుతో, సులువుగా మెరుగైన ఫలితాన్ని రాబట్టుకోవచ్చునని వివరించారు.