China Arunachal Pradesh names: అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కేంద్రం మరోమారు తీవ్రంగా తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలు తమవే అని చైనా చేస్తున్న వాదనను ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది.
China Bridge Pangong Tso
ప్యాంగాంగ్ సరస్సుకు ఆవల చైనా నిర్మిస్తున్న వంతెనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆ ప్రాంతం 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలో ఉందన్నారు.
"అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భగామేనని మరోసారి మీకు (చైనా) గుర్తు చేస్తున్నా. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. భారత్ ఈ నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని చైనా గమనించాలి."