Mayor Arya Rajendran Wedding: దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా వార్తల్లోకెక్కిన ఆర్యా రాజేంద్రన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని ఏకేజీ సెంట్రల్ హాల్లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్వీ గోవిందన్, మంత్రులు శివన్కుట్టి, మహ్మద్ రియాజ్, ఆంటోని రాజు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇరువురు దంపతులు పూల దండలు మార్చుకున్నారు.
తమ పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురావొద్దని గతంలోనే చెప్పారు. తమకు గిఫ్ట్‌లు ఇచ్చే బదులు అనాథ ఆశ్రమాలకు సాయం చేయాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు ఇవ్వాలని కోరారు. బలుస్సెరి అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించడం వల్ల పెళ్లి పీటలెక్కారు.
యంగెస్ట్ మేయర్..ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్. తల్లి శ్రీలత ఎల్‌ఐసీ ఏజెంట్. మొదటి నుంచీ వీరి కుటుంబం సీపీఎం మద్దతుదారులు. ఈ క్రమంలో ఆరేళ్ల వయసులోనే వామపక్షాల ఆధ్వర్యంలో నడిచే బాల సంఘంలో చేరారు ఆర్య. ఆసియాలోనే అత్యధిక మంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. సుమారు పది లక్షల మంది పిల్లలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పిల్లల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ద్వారా స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం సంపాదించుకున్నారు ఆర్య. ఆ ఆత్మవిశ్వాసంతోనే కాలేజీలోనూ తోటి విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతూ వచ్చారు. ఈ క్రమంలో బాల సంఘం తరఫున చురుగ్గా సేవలదిస్తుండడంతో ఆమెను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది సీపీఎం అధిష్ఠానం. అలాగే విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో చేరి తోటి విద్యార్థుల హక్కుల కోసం గళమెత్తారు ఆర్య.