ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు కోసం బీఎస్పీ చర్చలు జరుపుతోందని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు.
యూపీలో మాజీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్పీ), హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎంతో కలిసి ‘భాగీదారీ సంకల్ప్ మోర్చా’ పేరిట మాయావతి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై వచ్చే నెల ఓవైసీ లఖ్‌నవూ వెళ్లనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మాయావతి నుంచి తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ మినహా వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరాఖండ్‌లోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మాయావతి స్పష్టం చేశారు.