'భారత దేశ రాష్ట్రపతిగా మాయావతి!'.. చాలాకాలంగా వినిపిస్తున్న మాట. బీఎస్పీ అధినేత్రి మాయావతిని అధికార పక్షం భాజపానే దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందన్నది ఆ ఊహాగానాల సారాంశం. దీనిని విమర్శనాస్త్రంగా చేసుకున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. "ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లన్నీ భాజపాకు బదిలీ అయ్యాయి. ఇందుకు ప్రతిఫలంగా భాజపా మాయావతిని రాష్ట్రపతిని చేస్తుందా లేదా చూడాలి" అని బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు అఖిలేశ్.
ఎస్పీ అధినేత అఖిలేశ్ వ్యాఖ్యలపై గురువారం లఖ్నవూలో తీవ్రంగా స్పందించారు మాయావతి. "స్వార్థపూరిత రాజకీయ దురుద్దేశంతోనే నేను రాష్ట్రపతిని కావాలని ఎస్పీ కల కంటోంది. అది నేరవేరదు. నేను రాష్ట్రపతిని అయితే అఖిలేశ్ యూపీ సీఎం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందన్నది ఎస్పీ ఆశ. అది అసాధ్యం.
భవిష్యత్లో నేను యూపీ ముఖ్యమంత్రిని లేదా భారత దేశ ప్రధాన మంత్రి కావాలని మాత్రమే కల కంటా. రాష్ట్రపతి కావాలని ఎప్పుడూ అనుకోను. జీవితంలో నేను ఎప్పుడూ సుఖాల కోసం చూసుకోలేదు. అంబేడ్కర్, కాన్షీ రామ్ చూపిన మార్గంలో అణగారిన వర్గాల ప్రజలు సాధికారిత సాధించేలా చూసేందుకు శ్రమించా. ఈ పని రాష్ట్రపతి చేయలేరని.. యూపీ సీఎం లేదా దేశ ప్రధాని అయితేనే సాధ్యమని మీ అందరికీ తెలుసు" అని స్పష్టం చేశారు మాయ. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, అగ్రవర్ణ పేదలు బీఎస్పీకి అండగా నిలిస్తే.. తాను మళ్లీ యూపీ సీఎం లేదా దేశ ప్రధాని కావడం సాధ్యమని అన్నారు.
భాజపా-బీఎస్పీ క్విడ్ ప్రో కో!:యూపీలో ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఎస్పీ.. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. బీఎస్పీ ఓట్లన్నీ భాజపాకు బదిలీ అయ్యాయని అనేక విశ్లేషణలు వచ్చాయి. ఉత్తర్ప్రదేశ్ భాజపా నేతలు పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే విషయం ప్రస్తావించారు.
Mayawati president of India: ఎన్నికల ప్రచారం సమయంలోనూ భాజపా-బీఎస్పీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, మాయావతిని అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టవచ్చని అఖిలేశ్ విమర్శలు సంధించారు. మరోవైపు.. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడం విశేషం. ఆ తర్వాత రెండు పార్టీలు విడిపోగా.. ఇరువురు నేతలు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు.