Mayawati in UP Election: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బహుజన్ సవాజ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్ర కీలక ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల్లో పార్టీ అధినేత్రి మాయావతి పోటీ చేయరని వెల్లడించారు. తాను కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. త్వరలోనే మాయావతి.. ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పారు సతీశ్.
మాయావతి.. నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 1995, 1997 సంవత్సరాల్లో కొద్ది కాలం పాటు సీఎంగా పనిచేశారు. అనంతరం 2002 నుంచి 2003 వరకు, 2007 నుంచి 2012 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
'ప్రజలు మోసపోయారు'
ఎన్నికల వేళ భాజపా, ఎస్పీ ప్రజలకు కొత్త హామీలు ఇస్తున్నా.. వారి పరిపాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు సతీశ్. "ఈ పరిస్థితుల్లో ఓటర్లకు తాము మోసపోయిన భావన కలుగుతోంది. అందుకే మా పార్టీపై ఓటర్లకు నమ్మకం కలుగుతోంది. మా పార్టీ సమాజిక న్యాయనికి, సమానత్వానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది." అని సతీశ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 10న యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలి దశ జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 10న తెలుస్తాయి.
ఇదీ చూడండి :'లక్కీ' గొర్రె పిల్ల వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు!