గత 121 ఏళ్లలో దేశవ్యాప్తంగా మే నెలలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక పేర్కొంది. ఈ నెలలో సంభవించిన రెండు తుఫానుల కారణంగా నమోదైన రికార్డు వర్షపాతం దీనికి కారణమని తెలిపింది. 1901 తరువాత దేశంలో సగటు ఉష్ణోగ్రత నాలుగోసారి అత్యల్పంగా(34.18 డిగ్రీల సెల్సియస్) ఈ మేలోనే నమోదైనట్లు పేర్కొంది.
"ఇప్పటివరకూ మే నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు గమనిస్తే.. 1917లో 32.68 డిగ్రీల సెల్సియస్, 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ ఏడాది మే 29-30 తేదీల్లో వాయువ్య రాజస్థాన్ మాత్రమే గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది."
-ఐఎండీ నివేదిక
ఇక 2021 మేలో దేశవ్యాప్తంగా 107.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ పేర్కొంది. ఇది సాధారణం కన్నా 74 శాతం ఎక్కువని.. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు కనిపించలేదని నివేదిక తెలిపింది.