బయట క్రూరమైన నేరాలు జరుగుతున్నాయని చెప్పి నిందితునికి శిక్ష వేయడం సరైనది కాదని సుప్రీంకోర్టు(Supreme Court Of India) సోమవారంవ్యాఖ్యానించింది. సాక్ష్యాలకు అనుగుణంగా శిక్షలు ఉండాలని తెలిపింది. నేరాన్ని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్‌దేనని పేర్కొంది. 1999లో జరిగిన ఓ దోపిడీ కేసులో నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ(Chief Justice Of India), జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
రూ.40వేలు తీసుకొని తన బంధువుతో కలిసి స్కూటర్‌పై దిల్లీ వెళ్తున్న వ్యక్తిని నిందితుడు దాడి చేసి దోచుకున్నాడని కేసు నమోదయింది. ఆయనతో పాటు మరో నలుగుర్నీ నిందితులుగా చేర్చారు. వీరికి ట్రయల్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దానిపై హైకోర్టులో అప్పీలు చేయగా ఏడేళ్లకు తగ్గించింది. అయితే తాను ఎలాంటి నేరం చేయలేదంటూ నిందితుడు సుప్రీంకోర్టును(Supreme Court Of India) ఆశ్రయించాడు. మౌఖిక సాక్ష్యాలకు... సంఘటన స్థలంలో జరిగిన రుజువులకు తగిన పొంతన కుదరలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. బలమైన ఆధారాలు లేనప్పుడు సంశయలాభం(Supreme Court On Benefit Of Doubt) కింద నిందితునికి శిక్ష విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. దోపిడీ కేసులు పెరుగుతున్నందు వల్ల కూడా ఈ నిందితునికి శిక్ష విధించాలని కోర్టులు భావించడం సరికాదని పేర్కొంది.