Mathura Shahi Idgah Survey Allahabad High Court :ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు కేసులో కీలక పరిణామం జరిగింది. మసీదును సర్వే చేసేందుకు కోర్టు కమిషనర్‌ను నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకోసం విధి విధానాలను ఈ నెల 18న ఖరారు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔరంగజేబ్ పాలనలో శ్రీకృష్ణుడి మందిరాన్ని కూల్చి, షాహీ ఈద్గాను నిర్మించారని, మసీదులో సర్వే చేపడితే నిజాలు బయటకు వస్తాయని హిందూ పక్షం దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు అనుమతించింది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన వ్యాజ్యానికి అనుబంధంగా ఈ వ్యాజ్యం దాఖలైంది.
'మసీదుకు నష్టం కలిగించొద్దు'
సర్వే నిర్వహించే సమయంలో మసీదుకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. అక్కడి పవిత్రతకు భంగం కలిగించకూడదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఏడుగురు భక్తులు దాఖలు చేశారు. శ్రీకృష్ణుడిని సైతం పిటిషనర్‌గా పేర్కొన్నారు. మసీదు కింద శ్రీకృష్ణుడి జన్మ స్థానం ఉందని వ్యాజ్యంలో వివరించారు. అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని కూల్చివేసి షాహీ ఈద్గా నిర్మించారని చెప్పడానికి పలు ఆధారాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టుకు షాహీ ఈద్గా మేనేజ్మెంట్
హిందువుల తరఫున న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవకీ నందన్ వాదనలు వినిపించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ఈ తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపింది.