Mathura Illegal Construction Demolition Case : ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రీకృష్ణ జన్మస్థానం మథురలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 10రోజులపాటు యథాతథస్థితి కొనసాగించాలంటూ... కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి సారథ్యంలోని ధర్మాసనం... ఉత్తర్వులు జారీచేసింది.
శ్రీకృష్ణ జన్మభూమికి సమీపంలో ఆక్రమణల కూల్చివేత కోసం రైల్వేశాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. వారం తర్వాత వాదనలు ఆలకిస్తామని తెలిపింది. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది.. ఇప్పటివరకు వంద ఇళ్లను కూల్చేసినట్లు తెలిపారు. ఇంకా 70-80 ఇళ్లు మాత్రమే మిగిలినట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కోర్టులకు సెలవురోజే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు.
కేసు ఇదీ..
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 9న మథుర నయీ బస్తీలో అక్రమ ఇళ్ల కూల్చివేత ప్రారంభించింది. ఇప్పటికే పలు ఇళ్లను కూల్చేసినట్లు సమాచారం. శ్రీకృష్ణ జన్మభూమికి వెనకవైపు ఉన్న రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఈ నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ అక్రమ నిర్మాణాలని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు, జిల్లా అధికారులతో కలిసి కూల్చివేత పనులు చేపట్టారు.