తమిళనాడు మధురైలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు.
టపాసుల కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. చెల్లాచెదురుగా మృతదేహాలు - తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం
తమిళనాడులోని టపాసుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రమాదానికి గురైన టపాసుల కర్మాగారం అనుశియ వలియప్పన్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు తెలిపారు. మధురై సమీపంలోని అజగుసిరై గ్రామంలో ఈ కర్మాగారం ఉంది. ఫస్ట్ బ్లాక్‌లో మొదటగా పేలుడు సంభవించగా క్రమంగా అవి సెకండ్ బ్లాక్‌కు వ్యాపించాయి. దీంతో కార్మికులు మంటల్లో చిక్కుకొని చనిపోయారు. మరణించిన వారిని గుర్తుపట్టేందుకూ సమయం పట్టింది. మృతులను రఘుపతి కొండమ్మాళ్, వల్లరసు, విక్కీ, అమ్మాసి, గోపిలుగా గుర్తించారు. మొత్తం 13 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పేలుడు ఘటనపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవితో పాటు పలువురు సైతం సంతాపం తెలిపారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో చాలా వరకు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తమిళనాడు రారాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి మూర్తి, మాజీ మంత్రి శేఖర్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.