కాంగ్రెస్ పార్టీ(congress party) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్తబ్దత నుంచి బయటపడి క్రియాశీలమయ్యారు. పార్టీలో పెద్ద మార్పులు తీసుకొచ్చే దిశగా ఆమె ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు(Congress) ఇప్పుడప్పుడే పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునే సూచనలు లేనప్పటికీ, వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు(Assembly election 2022) పార్టీని సమాయత్తం చేసే కృషి మొదలైంది. 2022లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపుర్, గోవా, గుజరాత్‌ల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ రాష్ట్రాలు కొన్నింటిలో ఒంటరిగా, మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలతో కలసి భారతీయ జనతా పార్టీని ఓడించే లక్ష్యంతో పావులు కదుపుతోంది. పాత, కొత్త తరం నాయకుల సంగమంతో విజయం సాధించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి యువ నాయకులకు కీలక పదవులు ఇవ్వడం, పాత నేతలైన గులాం నబీ ఆజాద్ (జమ్ముకశ్మీర్), రమేశ్ చెన్నితల (కేరళ) వంటివారి అనుభవాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ఇందులో భాగం. త్వరలో కనీసం ముగ్గురు కొత్త ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. ఈ నియామకాలు యువ నేతలు, అనుభవజ్ఞుల కలయికగా ఉంటాయని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. ప్రియాంక గాంధీ మరింత విస్తృతమైన బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు కోరుకొంటున్నారు.
పార్టీలోకి ప్రశాంత్ కిశోర్
కాంగ్రెస్‌ను బలోపేతం చేసే కృషిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. మే 2 నాటి బెంగాల్ గెలుపు తరువాత ఆయన జులై 13న రాహుల్, ప్రియాంకలతో సమావేశమయ్యారు. సోనియా గాంధీ కూడా వర్చువల్‌గా వీరి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలక కుటుంబం ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నా, ఆయన అలాంటిదేమీ లేదంటున్నారు.