వరకట్న దాహనానికి ఓ వివాహిత బలైపోయింది. ధనదాహంతో అత్తింటివారే హత్య చేసి.. తమ నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాధితురాలిని నది ఒడ్డున పూడ్చిపెట్టారు. అంతటితో సంతృప్తి పడక బయటకు తీసి కాల్చేశారు. ఈ దుర్ఘటన బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఇదీ జరిగింది:ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరౌలీ గ్రామానికి చెందిన శత్రుఘ్న బింద్‌తో.. బభన్గామా గ్రామానికి చెందిన అఖిలేశ్ బింద్ కుమార్తె మమతా దేవికి 2021, మేలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత వరకట్నం ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వ్యాపారం చేసేందుకు రూ.2 లక్షలు తేవాలని అత్తింటివారు వేధించటం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇటీవలే తల్లిదండ్రులకు తెలియజేసింది బాధితురాలు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల వారి డిమాండ్‌ను తీర్చలేకపోయారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తాము అడిగిన కట్నం ఇవ్వలేదనే కోపంతో మమతా దేవిని హత్య చేసిన భర్త, అత్తింటివారు.. ఆధారాలు లేకుండా చేసేందుకు గుట్టుగా పూడ్చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఓ కారును అద్దెకు తీసుకుని సరిపుర్ విశ్వన్పుర్ గ్రామం సమీపంలో నది ఒడ్డున పూడ్చేశారు. ఆ తర్వాత కారును పంపించేశారు. కానీ, వారు అంతటితో సంతృప్తి చెందలేదు. మృతదేహాన్ని బయటకు తీసి కాల్చేశారు.