తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో పెళ్లైన వారికి ఆస్ట్రేలియాలో విడాకులా?'.. విదేశీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసిన మద్రాస్ న్యాయస్థానం - ఇండియా దంపతులకు ఆస్ట్రేలియా విడాకులు

దేశంలో పెళ్లి చేసుకున్న ఓ జంటకు ఆస్ట్రేలియా కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని చెన్నై కుటుంబ న్యాయస్థానం తప్పుబట్టింది. ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది.

chennai family Court australia divorce
chennai family Court australia divorce

By

Published : Jul 20, 2023, 6:40 PM IST

భారత్​లో వివాహం చేసుకున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలను చెన్నైలోని కుటుంబ న్యాయస్థానం కొట్టేసింది. భారత్​లోని ఏ చట్టం ప్రకారం వివాహం జరిగినా.. కేసు దేశంలోనే నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. భారత్​లో జరిగిన వివాహాలకు ఆస్ట్రేలియా కోర్టులు విడాకులు మంజూరు చేయలేవన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కేసు వివరాలు ఇలా..
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడుకు చెందిన మహిళ.. ఆస్ట్రేలియాలో కలిసి చదువుకుంటుండగా ప్రేమలో పడ్డారు. వేర్వేరు మతాలకు చెందిన వీరిద్దరూ 2006లో చెన్నైలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోనే నివాసం ఏర్పరచుకున్న ఈ జంటకు ఓ బాబు ఉన్నాడు.

అయితే, మహిళ మతం, భాష, ఆచార వ్యవహారాల పట్ల భర్త కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ మహిళ మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలోనే ఆమె భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. లక్షల రూపాయలను భార్య నుంచి తీసుకుని ప్రేయసి ఖర్చుల కోసం వినియోగించేవాడు. ఇదేంటని అడిగినందుకు తల్లితో కలిసి భార్యను కొట్టేవాడు. దీనిపై ఆమె ఆస్ట్రేలియాలోని ఓ న్యాయస్థానంలో కేసు పెట్టింది. ఇది పెండింగ్​లో ఉండగానే.. అడిలైడ్ ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో విడాకుల కోసం అతడు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 2020లో దంపతులకు విడాకులు మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో విడాకులు రద్దు చేయాలని కోరుతూ బాధిత మహిళ.. మద్రాస్ హైకోర్టు కాంప్లెక్స్​లో ఉన్న చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై మూడో అదనపు కుటుంబ న్యాయస్థానం జడ్జి కేఎస్ జయమంగళం విచారణ జరిపారు. కోర్టులో హాజరు కావాలని వాట్సాప్, ఈమెయిళ్ల ద్వారా బాధితురాలి భర్తకు సమన్లు పంపించారు. వీటికి అతడు స్పందించలేదు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా న్యాయస్థానాలు భారత్​లో వివాహం చేసుకున్న జంటకు విడాకులు మంజూరు చేయలేవన్న మహిళ తరఫు న్యాయవాది జార్జ్ విలియమ్స్ వాదనలను ఫ్యామిలీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం ఆస్ట్రేలియా కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఈ జంటకు మంజూరైన విడాకులను రద్దు చేసింది. భార్యకు సమన్లు పంపించకుండానే అడిలైడ్ కోర్టు విడాకులు జారీ చేసిన విషయాన్ని చెన్నై కుటుంబ న్యాయస్థానం గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వివాహానికి మహిళ భర్త సిద్ధం కావడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details