పెళ్లి బట్టలు నచ్చలేదని వివాహాన్నే రద్దు చేసింది ఓ యువతి. తనకు ఆ లెహంగా నచ్చలేదని తల్లి చెప్పిన మాటలు విన్న వధువు.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్యలో ఘర్షణ తలెత్తగా పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.
హల్ద్వానీలో నివాసముంటున్న ఓ యువతికి, అల్మోరాలో నివాసముంటున్న ఓ యువకుడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్ 5న పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పనుల్లో భాగంగా యువకుడి తరఫువాళ్లు పెళ్లి కార్డులు సైతం అచ్చు వేయించారు. అయితే ఇంతలోనే ఇరు వర్గాలకు ఓ విషయమై వాగ్వాదం మొదలైంది. పెళ్లి కూతురి కోసం వరుడి తండ్రి లఖ్‌నవూ నుంచి ఓ ఖరీదైన లెహంగాను ఆర్డర్ చేశారు. పెళ్లికి ముందు ఆమెకు అందించారు. అయితే ఆ లెహంగాను చూసిన యువతి తనకు నచ్చలేదని తేల్చి చెప్పింది. ఇదే మాట తన తల్లి సైతం చెప్పడం వల్ల ఈ మాట అబ్బాయి ఇంట్లో తెలిసింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ససేమిరా ఈ పెళ్లి జరిగేది లేదంటూ ఇరు వర్గాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. అలా అక్టోబర్30న యువకుడి బంధువులు యువతి ఇంటికి చేరుకుని లక్ష రూపాయల నగదు ఇచ్చి వివాహ రద్దు ఒప్పందానికి వచ్చారు. డబ్బులు ఇచ్చిన్నట్లు రుజువుగా ఓ వీడియోను సైతం తీసుకున్నారు.