Marital Status Karnataka High Court :వివాహం చేసుకున్నంత మాత్రాన భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి జరిగినందు వల్ల భాగస్వామికి సంబంధించిన వివరాలను తెలుసుకోలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం సమర్థించింది. 2016, ఆధార్ చట్టం ప్రకారం వైవాహిక జీవితంలో ఉన్నా సరే.. ఓ వ్యక్తికి పరిమితమైన వ్యక్తిగత వివరాలను ఇతరులకు (భార్యకు కూడా) తెలియాజేయాల్సిన అవసరం లేదని జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్‌తో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
అయితే అంతకుముందు ఇదే కేసులో హై కోర్డులోని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.. బాధిత మహిళకు సానుకూలంగా తీర్పునిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ యూఐడీఏఐ డైరెక్టర్ ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరోసారి విచారించాలని తీర్పునిచ్చిన సింగిల్ మెంబర్ బెంచ్‌ను ఆదేశించింది డివిజన్ బెంచ్. అంతేకాకుండా ఈ కేసులో భర్తను ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంది.
ఇదీ కేసు..
కర్ణాటక హుబ్బళ్లికి చెందిన ఓ మహిళకు 2005లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో కొంతకాలం క్రితం వీరిద్దరు విడిపోయారు. భర్తపై కేసు పెట్టడం వల్ల.. బాధిత భార్యకు, ఆమె కుమార్తెకు ప్రతినెల భరణం కింద రూ.10,000, రూ.5,000లను చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం భర్త భరణం చెల్లించకపోగా.. తప్పించుకొని తిరుగుతున్నాడని భార్య ఆరోపించింది. దీంతో అతడి ఆచూకీ కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI)ని ఆశ్రయించింది బాధితురాలు. తన భర్తకు చెందిన ఆధార్ వివరాలను తెలపాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంది. కాగా, ఈ అప్పీల్‌ను 2021, ఫిబ్రవరి 25న ఆధార్ సంస్థ తిరస్కరించింది. అంతేకాకుండా 2016, ఆధార్ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని.. వాటి గోప్యతకు భంగం కలిగించలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై స్పందించిన సింగిల్ బెంచ్.. అప్పట్లో భర్తకు నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే మహిళ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని 2023, ఫిబ్రవరి 8న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థని ఆదేశించింది.